తండ్రి మాటను జవదాటని శ్రీరామచంద్రుడు... భర్త అడుగుజాడల్లో నడిచిన సీతమ్మ తల్లి వృత్తాంతాన్ని తెలిపే రామాయణ ఘట్టాలు భద్రాచలం పుణ్యక్షేత్రంలో చిత్రకూట మండపంలో కొలువుదీరాయి.
ఎన్నో ఘట్టాలు
రాముని జననం, విశ్వామిత్రుడి వద్ద రామలక్ష్మణులు అస్త్రశస్త్రాలు నేర్చుకుని బాల్యంలోనే రాక్షసులను వధించడం, రాముడు శివ ధనస్సు విరిచి సీతమ్మను కల్యాణం చేసుకోవడం వంటి ఘట్టాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. భరతునికి పట్టాభిషేకం చేయాలని కైకేయి కోరటం.. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్లడం... సీతను రావణుడు అపహరించడం, రామరావణ యుద్ధం, సీతారాముల పట్టాభిషేకం... ఇలాంటి ఘట్టాలు ఎన్నో ఆకట్టుకుంటున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా చిత్రాలున్నాయి.
అందమైన శిల్పకళా
భక్త రామదాసు రామభక్తితో ఆనాటి కాలంలోనే చిత్రకూట మంటపాన్ని అందమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రాతితో చెక్కిన శిల్పాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. శిల్పకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఈ మండపం స్వామివారి అనేక ఉత్సవ కార్యక్రమాలకు వేదికగా అలరారుతోంది.
- ఈ కథనం చదవండి: యాదాద్రిలో కేసీఆర్... ఆలయ పనుల పురోగతిపై ఆరా...