రాష్ట్రం మొత్తం కరోనా మహమ్మారికి భయపడుతుంటే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రజలకు అసలు భయమే లేనట్టుంది. పట్టణంలోని కొన్ని రేషన్ దుకాణాల ముందు గుంపులు గుంపులుగా బారులు తీరారు. దుకాణాదారులు సైతం భౌతికదూరం పాటించేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అసలు వీళ్లకు కరోనా అంటే భయం లేదా... తమను కొవిడ్ ఏమీ చేయలేదనే ధీమానా...! అని ఆలోచిస్తే... వాటన్నింటి కంటే... ఆకలి తీర్చుకునేందుకు తీసుకునే రేషన్ కోసం తపన, డీలర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.
రేషన్ డీలర్ నిర్లక్ష్యం...
భద్రాచలంలోని కొత్త మార్కెట్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ఉదయం నుంచి రేషన్ కోసం వచ్చిన ప్రజలు కనీస నిబంధనలు కూడా పాటించకుండా క్యూలైన్లలో ఒకరినొకరు తోసుకుంటూ నిల్చున్నారు. దుకాణాదారుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. కొందరు మహిళలు గత మూడు రోజుల నుంచి రేషన్ దుకాణం చుట్టూ తిరుగుతున్నా రేషన్ ఇవ్వడానికి దుకాణదారుడు నానా ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. పక్కపక్కనే ఉన్న రెండు రేషన్ దుకాణాలకు డీలర్ ఒక్కరే కావటం వల్ల ఒక్కో దుకాణంలో గంట చొప్పున సరుకులు ఇస్తున్నారు.
ఈ పద్ధతిపై వియోగదారులు డీలర్తో వాగ్వాదానికి దిగారు. గంటలకొద్ది క్యూలైన్లో వేచి ఉన్నా రేషన్ ఇవ్వటంలేదని ఆందోళన చేశారు. కరోనా వ్యాప్తి వేగంగా విస్తృతి ఉన్నప్పటికీ రేషన్ డీలర్లు నిబంధనలు ఏమి పాటించడంలేదని... ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.