కరోనా వల్ల మృతి చెందిన తండ్రి అంత్యక్రియలకు రాలేని పరిస్థితుల్లో కొడుకు ఉన్నాడు.. ఈ హృదయవిదారకర ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. పట్టణంలోని మూడో వార్డుకు చెందిన నక్కా ప్రకాశం(74) మరియమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. కుమారుడు భూపాలపల్లిలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతుర్లు ఇద్దరు స్థానికంగా ఉంటున్నారు.
పది రోజుల క్రితం వృద్ధ దంపతులు ఇద్దరికీ కొవిడ్ సోకగా... కొడుకు వచ్చి వారికి మందులు ఇప్పించి హోం ఐసోలేషన్లో ఉంచి వెళ్లాడు. వారికి కూతుళ్లు సమయానుసారం ఆహారాన్ని అందజేస్తున్నారు. ఎప్పటిలాగే తన తల్లిదండ్రులకు మధ్యాహ్నం పూట కూతురు ఆహారం ఇచ్చి వెళ్లింది. సాయంత్రం వృద్ధుడు కదలలేని స్థితిని స్థానికులు గమనించి వారికి సమాచారం అందించగా.. వృద్ధుడు చనిపోయిన విషయం వెలుగు చూసింది.
అంత్యక్రియలకు రాలేని పరిస్థితి..
మృతుని కొడుకు, తన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో.. అంత్యక్రియలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అంత్యక్రియలకు బంధుమిత్రులు, స్థానికులు ఎవరు రాలేని పరిస్థితి ఎదురు కావడంతో సమాచారం తెలుసుకున్న పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు... ఇద్దరు వార్డు సభ్యులతో కలిసి అంతక్రియలు నిర్వహించారు. ఇలా కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తూ.. అయినవారి కడచూపుకి కూడా నోచుకోకుండా చేస్తోంది.
ఇదీ చూడండి: మందుపాతరల జాడను పట్టించిన 'హీరో ర్యాట్'