యువతకు వ్యవసాయంపై ఆసక్తి కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు పర్యటించారు. జిల్లాలోని బూర్గంపాడు, సారపాక, భద్రాచలంలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. ముందుగా వ్యవసాయ కమిటీకి నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. అన్నదాతలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సాగులో ఉన్న మెళకువలు యువతకు తెలియజేసి వ్యవసాయంపై ఆసక్తి కల్పించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో యువతరం ఉద్యోగాలే కాదు.. వ్యవసాయంలోనూ ముందుండేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు వివరించారు.