మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటు సాధించిన గిరిజన విద్యార్థినికి అండగా నిలిచారు. వారణాసి ఐఐటీలో సీటు పొందిన గిరిజన కోయ తెగకు చెందిన విద్యార్థిని శ్రీలతకు ఆపన్నహస్తం అందించారు. నాగర్ కర్నూల్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఐఐటీ వారణాసిలో సీటు సాధించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెంకి చెందిన శ్రీలత తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఫీజులు చెల్లించే స్తోమత లేకపోవడంతో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రగతి భవన్‌లో మంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా శ్రీలతను మంత్రి అభినందించారు. శ్రీలత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. తన సొంత నిధులతో విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అత్యంత నిరుపేద కుటుంబం నుంచి అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కొనియాడారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదని.. కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించిందని ప్రశంసించారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న గిరిజన ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు సంతృప్తినిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థిని ఐఐటీ విద్య కోసం చెక్కును మంత్రి అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐటీ రంగంలోనూ ప్రతిభ చాటాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇదీ చూడండి: