పనులు లేక, చేతిలో డబ్బులు లేక ఓపిక నశించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీటీపీఎస్ నిర్మాణ కార్మికులు సోమవారం ఆందోళన బాట పట్టారు. ఎంతకాలం ఇలా ఉండాలని సొంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కార్మికులు బీటీపీఎస్ ప్రధాన గేటు, బెల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న కార్మికులు నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి అక్కడ పనులు చేయకుండా అడ్డుకున్నారు. పనులు చేసే వారిపై దాడికి యత్నించారు. వెంటనే ఘటనా స్థలానికి మణుగూరు సీఐ షూకూర్, సీఈ బాలరాజు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. ఏదో ఒక రూపాన ఇక్కడి నుంచి పంపించమని కార్మికులు అధికారిని వేడుకున్నారు.
ప్రభుత్వ ఆదేశం లేకుండా ఏ విధంగా పంపాలని అధికారులు కార్మికులను ప్రశ్నించారు. బస్సు లేదా రైలులో సొంత గ్రామాలకు పంపాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం వెళ్లాలనుకుంటే కార్మికులు సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కార్మికులకు సూచించారు. పలువురు కార్మికులు వేతనాలు పొందలేదని వాపోగా... ఆ వివరాలు అందిస్తే వేతనాలు చెల్లిస్తామని సీఈ బాలరాజు కార్మికులకు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 'వలస కూలీల ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి'