ప్రయాణ ఖర్చులు కూడా లేని వలస కూలీలను ఉచితంగా వారి స్వస్థలాలకు పంపించేలా రైల్వేశాఖ, ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారినుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. సొంతూళ్లకు పంపించేందుకు వలస కూలీల నుంచి పెద్దఎత్తున ఛార్జీలు వసూలు చేస్తున్నారని, వారికి కరోనా టెస్టులు చేసిన తరువాతనే పంపించాలని అహ్మదాబాద్ ఐఐఎమ్ మాజీ డైరెక్టర్ జగదీప్ చొక్కర్ పిటిషన్ దాఖలు చేశారు.
వ్యాజ్యంలో పలు అంశాలను ప్రస్తావించిన పిటిషనర్, కేంద్రం ప్రకటించిన వలస కార్మికుల నిర్వచనం వివరణాత్మకంగా లేదని ఆక్షేపించారు. ఈ నిర్వచనం ఏప్రిల్ 29 వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉన్న వారికే వర్తిస్తోందన్నారు. వలస వచ్చి వీధి వ్యాపారం, పరిశ్రమల్లో పనిచేస్తున్నవారికి కూడా వర్తింపజేయాలని కోర్టును కోరారు. వీరంతా పట్టణాల్లో అద్దే ఇళ్లల్లో నివసిస్తున్నట్లు వివరించారు. దీనివల్ల లక్షల్లో ఉన్న వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లలేకుండా ఉన్నారని తెలిపారు. వీరందరిని వారి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
ఈమేరకు పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. లాక్‌డౌన్‌లో ఎలాంటి సంపాదన లేని కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయరాదని ఆయా రాష్ట్రప్రభుత్వాలు, రైల్వే శాఖకు స్పష్టం చేసింది.