Illegals in coal Transportation: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు రవాణ పేరిట సాగుతున్న వసూళ్ల బాగోతం అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. బొగ్గురవాణాను గుప్పిట్లో పెట్టుకున్న ఓ వ్యాపారి అధికార పార్టీ నేతల అందదండలతో.. ఏళ్లుగా లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఇందుకోసం కోయగూడెం ఓసీ కేంద్రంగా వసూళ్ల రాయుళ్ల ముఠా ఆ వ్యహారాలను చక్కబెడుతుంది. కోయగూడెం ఓసీ నుంచి పలుపరిశ్రమలకు నిత్యం వందల లారీల్లో బొగ్గు రవాణా చేస్తారు. ఆ బొగ్గు రవాణాచేసేందుకు వస్తున్న లారీల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలకు వివిధ రకాల సరుకు తీసుకొచ్చే లారీలు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వెళ్లకుండా బొగ్గు రవాణకి వస్తుంటాయి.
స్థానికంగా కోల్ యూనియన్‌ను సంప్రదించి లోడింగ్‌కు వెళ్తాయి. అలా రోజుకు కోయగూడెం నుంచి సుమారు 50 నుంచి 100 వరకు లారీలు వెళ్తుంటాయి. ఆ లారీల నుంచి యూనియన్ సంక్షేమం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో లారీ నుంచి గతంలో రూ.300 వరకు వసూళ్లు చేసేవారు. అయతే ఏటికేడు ఆ మొత్తాన్ని పెంచుకుంటూవెళ్తున్నారు. అడిగేవారు లేకపోవడం లారీయజమానులు, డ్రైవర్లు ప్రశ్నించకపోవడంతో ఒక్కో వాహనం నుంచి రూ.900 వసూలు చేస్తున్నారు.
ఏటా రూ.3 కోట్ల వరకు వసూలు చేసి జేబుల్లో వేసుకుంటున్నారు. అదేకాకుండా యార్డుపేరిట అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కోయగూడెం ఓసీ వేదికగా సాగుతున్న ఆ అక్రమ వసూళ్ల బాగోతమంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతోంది. పైసా పెట్టుబడి లేకుండా కోట్లల్లో వసూళ్లు చేస్తుండటం.. వచ్చిన సొమ్మును నెలవారీగా వాటాలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
బొగ్గు రవాణాలో ఏళ్లుగా చక్రం తిప్పుతున్న ఓ వ్యాపారితో పాటు అధికారపార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతల సహకారంతోనే వసూళ్ల దందా సాగుతోంది. వచ్చిన సొమ్ములో కొందరు అధికారులకు నెలవారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా చెక్‌పోస్టు బయట జరుగుతుండటంతో సింగరేణి యాజమాన్యం వసూళ్ల పర్వాన్ని పట్టించుకోవడం లేదు.
ఇవీ చదవండి: