భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో డ్రైనేజీల నిర్మాణ పనులను చేపట్టారు పురపాలక అధికారులు. వాటిని మధ్యలోనే వదిలేయడం వల్ల దుకాణాదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పురపాలక సిబ్బంది డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఓ టెంట్ హౌజ్ యజమాని డ్రైనేజిని దాటే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం వల్ల తలకు తీవ్ర గాయమైంది.
నెలల తరబడి జాప్యం చేయడం వల్ల తాము చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని పట్టణవాసులు వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణాల్లో జాప్యం చేయడమే కాకుండా నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు