భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అంతిమ సంస్కారాలు ఆయన జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం సున్నం వారి గూడెంలో నిర్వహించారు. చిన్ననాటి నుంచి సీపీఎం సిద్ధాంతాలను అలవరచుకున్న సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
ఈ మధ్యకాలంలో తన ఇద్దరు కుమారులకు, అల్లుడికి కరోనా సోకింది. దీంతో రాజయ్యకు కూడా కరోనా లక్షణాలు ఉండటం వల్ల వి.ఆర్.పురం మండలంలో పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ నెగెటివ్ రావడం వల్ల మళ్లీ భద్రాచలంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం భద్రాచలం వైద్యాధికారులు అతనికి పాజిటివ్ ఉందని నిర్ధరించారు. అప్పటికి ఆరోగ్యం క్షీణించడం వల్ల విజయవాడ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
విజయవాడ వెళ్తున్న క్రమంలో రాత్రి 12 గంటల తర్వాత శ్వాసఅందకపోవడం వల్ల సున్నం రాజయ్య మృతిచెందారు. దీంతో సున్నం వారి గూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కరోనాతో మరణించినా.. గిరిజనులు భయపడకుండా ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేశారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల అనేకమంది ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి