కార్మిక వ్యతిరేక సంస్కరణలతో నిర్వీర్యం అవుతున్న సింగరేణి (Singareni) సంస్థను కార్మికోద్యమాలతోనే జీవం పోసి పూర్వవైభవం తీసుకురావాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు (Ex Mla Nageshwara rao) అన్నారు. సింగరేణి సంస్థను పరిరక్షించాలని, ప్రభుత్వ ఆర్థిక దోపిడీని నివారించాలన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Ex Mla Kunamneni Samba Shivarao)నేతృత్వంలో రెండు రోజులు చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్ష (Hunger Strike)ను పువ్వాడ ప్రారంభించారు.
కూనంనేనికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి పువ్వాడ మాట్లాడారు. బీఐఎస్ఆర్ ముప్పు నుంచి సింగరేణిని కాపాడిన చరిత్ర ఏఐటీయూసీ, సింగరేణి కార్మికులదన్నారు. పన్నులు, సీఎస్ఆర్ నిధుల పేరుతో ప్రభుత్వం అప్పనంగా దోచేస్తోందని విమర్శించారు. గడిచిన ఆరేళ్లలో కేవలం రాయల్టీ పేరుతోనే రూ.9.255 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దోపిడీని అడ్డుకుంటేనే సంస్థకు మనుగడ ఉంటుందని పేర్కొన్నారు.
సంస్థ మనుగడ, 'సింగరేణి పరిరక్షణ సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉన్న ఏఐటీయూసీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయని కూనంనేని సాంబశివరావు అన్నారు. సంస్థ ఉన్నతాధికారి ప్రభుత్వ బంట్రోతుగా వ్యవహరిస్తూ సంస్థ సొమ్మును ప్రభుత్వానికి దోచిపెడుతున్నాడని ఆరోపించారు. కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితికి తీసుకువచ్చారన్నారు. సింగరేణి బచావో నినాదంతో ఉద్యమాలను ఉద్ధృతం చేసి సంస్థను పరిరక్షించుకోవాలని సూచించారు.
దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు, బాలశౌరి, సీఐటీయూ రాజారావు, వెంకటేశ్వరరావు, ఇతర విపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఐఏఎల్, టీజీఎస్, డీహెచ్‌పీఎస్, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఆటో వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నేతల బృందం సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఇవీ చూడండి: