భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఉపరితల బొగ్గు గని మైనింగ్ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి.. స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరై.. గని విస్తరణపై సామాన్యుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించాలని సింగరేణి అధికారులను కోరారు.
భూములను ధ్వంసం చేసి, నిర్వాసితులకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదని గుమ్మడి ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ ఖర్చు చేయాల్సిన నిధుల విషయంలో రెండు జిల్లాల కలెక్టర్లకు స్పష్టత ఉండడం లేదన్నారు. అభివృద్ధి నిధులపై అధికారులను ఆరా తీసినా.. సరైన సమాధానం రావడం లేదని వివరించారు.
సింగరేణి సంస్థతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు కోరారు. దేశానికి వెలుగివ్వడానికి.. సింగరేణి గనులకు పుట్టినిల్లైన ఇల్లందు ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా