భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీపీఎం నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్, తాళ్ళూరి పంచాక్షరయ్య ఛారిటబుల్ ట్రస్టు, అలూమినీ పూర్వ విద్యార్థుల సంఘం ఏన్కూర్, తానా వారి సహాకారంతో.. బండారు చందర్రావు ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 18 పడకలతో ప్రారంభించిన ఐసోలేషన్ కేంద్రాన్ని 25 పడకలకు పొడిగించి, అవసరాన్నిబట్టి ఇంకా పడకలు పెంచుతామని సీపీఎం నాయకులు తెలిపారు.
భద్రాచలంలోని కూనవరం రోడ్డులో గల డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన బాలికల పీఎంహెచ్ హాస్టల్ భవనంలో కేంద్రాన్ని ప్రారంభించారు. కొవిడ్ బారిన పడుతున్న పేదలకు ఇంట్లో కనీస సౌకర్యాలు లేక.. అందరితో కలిసి ఉండటం వల్ల ఇంకా ఎక్కువ మందికి వైరస్ సోకుతుందని నాయకులు వివరించారు. అలాంటి వారి కోసమే ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.