భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మంది వైద్య సిబ్బందికి మొదటి విడతలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తొలి టీకాను ఆస్పత్రి స్టాఫ్‌నర్స్ పుష్పలతకు వేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జేసీ వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు.
అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యుగంధర్, వైద్యులు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. తర్వాత ఎలాంటి దుష్పరిణామాలు కనిపించలేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన వారిని అరగంటసేపు పర్యవేక్షణలో ఉంచారు. ప్రభుత్వం తమకు ప్రాధాన్యం కల్పించి టీకా ఇవ్వడం సంతోషంగా ఉందని స్టాఫ్‌నర్స్ పుష్పలత అన్నారు. మొదటి విడతలోనే వ్యాక్సిన్ తీసుకోవడం ఆనందంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ అన్నారు.
వ్యాక్సినేషన్ వేళ మావోయిస్టుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఏజెన్సీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.