కొవిడ్ నిబంధనల పేరుతో భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణాన్ని భక్తుల నడుమ కాకుండా కొంతమంది వీఐపీలు, వైదిక సిబ్బందితో నిర్వహించాలని ఆలయాధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆలయంలోని బేడా మండపంలో కల్యాణ తంతు చేపట్టాలని సంకల్పించారు. భద్రాచలంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 18న అంకురార్పణ నిర్వహిస్తారు. 20న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. 21న సీతారాముల కల్యాణం, 22న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
భక్తులు రావొద్దు...
ఈనెల 21, 22తేదీలు అంటే రెండు రోజులపాటు భక్తులను ఎవరిని ఆలయ దర్శనాలకు అనుమతించడం లేదని ఆలయ ఈవో శివాజీ ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆ రెండు రోజులు భక్తుల దర్శనాలు నిలిపివేశామని తెలిపారు. ఆలయం తరఫున ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించామని... కొవిడ్ నిబంధనలు ఉన్నందున ముఖ్యమంత్రి కేసీఆర్... కల్యాణ మహోత్సవానికి హాజరు కావడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున...
ఈ వేడుకకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రమణాచారితో పాటు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని ఆలయ ఈవో స్పష్టం చేశారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి శ్రీరామనవమి పట్టాభిషేకం రోజు ఆలయం వద్దకు దర్శనాలకు రావద్దని సూచించారు.
ప్రసార మాధ్యమాల ద్వారా...
ప్రసార మాధ్యమాల ద్వారా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించాలని కోరారు. ఈనెల 21న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయంలో నిరాడంబరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుద్దీపాలు అలంకరించి, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. ఆలయానికి రంగులు దిద్దారు. కల్యాణ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వెల్లడించారు.
టికెట్ రుసుము చెల్లిస్తే...
భక్తులు కల్యాణంలో నేరుగా పాల్గొనకపోయినా... టికెట్ రుసుమును చెల్లిస్తే వారికి శేషవస్త్రాలు సీతారాముల కల్యాణ తలంబ్రాలు, ప్రసాదాలు పోస్టు ద్వారా పంపిస్తామని ఆలయాధికారులు వివరించారు. కొవిడ్ కారణంగా రాములోరి కల్యాణాన్ని చూడలేకపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదీ చదవండి: జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఎప్పుడూ రాలేదు: గుత్తా