కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలపైన పడింది. మన రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాదాపు 78 రోజుల లాక్డౌన్ తర్వాత జూన్ 8వ తేదీ నుంచి భద్రాద్రి రామయ్య సన్నిధి భక్తుల దర్శనాలకు ప్రవేశం కల్పిస్తుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడం వల్ల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య సాధారణం కంటే తగ్గింది. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు బంగారు కవచాల అలంకరణను అధికారులు ఆపివేశారు.
అన్ని సేవలు రద్దు..
లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రోజులలో ప్రతి శుక్రవారం లక్ష్మణ సమేత సీతారాములకు బంగారు కవచాలతో అలంకరణ చేసేవారు. ప్రస్తుతం భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున స్వర్ణకవచ అలంకృత అలంకారం చేయలేదని ఆలయ అధికారులు తెలిపారు.
షరతులు వర్తిస్తాయి..
జూన్ 8 నుంచి ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులు చాలా తక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కరోనా వ్యాప్తి నివారణ చర్యలు అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. శానిటైజర్ అందుబాటులో ఉంచి భక్తులంతా చేతులు శుభ్రపరుచుకునే విధంగా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
రామయ్య దర్శనానికి.. ముక్కోటి నియమాలు
- భక్తులు భౌతికదూరం పాటించే విధంగా ఆలయ సిబ్బంది గుర్తులు కేటాయించారు.
- మాస్కు విధిగా ధరించాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
- ప్రధాన ఆలయం లోపల తీర్ధం, శఠగోపం, ప్రసాదం ఇచ్చే ప్రక్రియను నిలిపివేశారు.
- ప్రతిరోజు సీతారాములకు జరిగే నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించడం లేదు.
- కల్యాణ మండపంలో కాకుండా ప్రధాన ఆలయం లోపలే వేడుకను నిర్వహిస్తున్నారు.
- భక్తులకు అంతర ఆలయ ప్రవేశం నిలిపివేశారు.
- ఆలయంలోని క్యూలైన్లలో నిత్యం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
తక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండం వల్ల ఆలయ ప్రాంతాలు, క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భద్రాద్రి ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం జరిగే సంధ్యాహారతి, ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి