ఏపీలో ఒక్కరోజే 80 కరోనా కేసులు నమోదవ్వడం సరిహద్దు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరు జిల్లాల అధికారులు సరిహద్దుల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువైపుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు అశ్వారావుపేట, భద్రాచలం తదితర చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచారు. అనుమానిత వ్యక్తులను, వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దన్నారు. ఖమ్మం జిల్లా మధిర, బోనకల్లు, పెనుబల్లి మండలాల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద అదే మాదిరిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
పకడ్బందీ చర్యలతో సత్ఫలితాలు..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కట్టడి చర్యలు సత్ఫలితాలను ఇస్తోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది కేసులతో ఆగిపోయింది. నిత్యం ఫలితాలు వస్తున్నప్పటికీ నెగిటివ్‌గా వెల్లడవుతోంది. సాంకేతికంగా ఖమ్మం జిల్లాలో ఎనిమిది పాజిటివ్‌లు ఉన్నప్పటికీ అవన్నీ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నమోదు చేసుకున్నాయి. అందులోనూ ఒకటో, మూడో పట్టణ ప్రాంతాల పరిధిలోనే విస్తరించాయి.
ఒకే ఇంటిలో అయిదుగురు బాధితులున్నారు. వారి కుటుంబంలో పని చేసే ఓ పనిమనిషి మరో బాధితురాలు. ఖమ్మం జిల్లాలో తొలి కేసు ఏప్రిల్ 6న నమోదు చేసుకోగానే పెద్దతండాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. తర్వాత ఖిల్లా, మోతీనగర్, బీకేబజార్ కంటైన్మెంట్ కిందకు వచ్చాయి. పెద్దతండా, మోతీనగర్‌లను ఇటీవల కంటైన్మెంట్ జాబితా నుంచి తొలగించారు.
ఉభయ జిల్లాల్లో కట్టడి ఇలా..
- పెద్ద ఎత్తున పారిశుద్ధ్య చర్యలు
- ప్రధాన రహదారులు, కాలనీల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారి
- సత్ఫలితాలు ఇస్తున్న ‘ఇంటింటి సర్వే’
- నిత్యావసరాలు, పాలు, కూరగాయలు ఇళ్లకే పంపిణీ
- అత్యవసర సేవలు, నిత్యావసరాలకు చరవాణి సంఖ్యలను కేటాయించడం
- ఖమ్మంలో అందబాటులోకి టెలీమెడిసిన్ సేవలు
- పాజిటివ్ కేసులు రాగానే ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించడం, నమూనాలు సేకరించడం
- హోం క్వారంటైన్, స్పెషల్ క్వారంటైన్‌లను ఏర్పాటు చేయడం
- అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లాల సరిహద్దుల్లో కట్టుదిట్టమైన చర్యలు
- అత్యధిక శాతం ప్రజలు చైతన్యవంతులై స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధం పాటించడం
- మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఉభయ జిల్లాల కలెక్టర్లు ఆర్‌వీ కర్ణన్, ఎంవీ రెడ్డి తరచూ సమీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇవ్వడం
- ఉభయ జిల్లాల అధికార యంత్రాంగం నిరంతరం శ్రమించడం.