భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరినది పరవళ్లు తొక్కుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద సీతమ్మసాగర్ ప్రాజెక్టులో భాగంగా గోదావరిలో నిర్మించిన కాపర్‌డ్యాం నీట మునిగింది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా జలవనరుల శాఖ గోదావరిలో అడ్డంగా 600 మీటర్ల పరిధిలో దీర్ఘవృత్తాకారంలో దీనిని నిర్మించారు. ఇటీవలే కాపర్‌డ్యాం మధ్యలో పనులు ప్రారంభించారు. అయితే గోదావరి ఉద్ధృతి పెరగడం వల్ల మందస్తు చర్యగా ఈనెల 13న పనులు నిలిపేశారు. భారీ యంత్రాలు, సామగ్రి ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 26.50 అడుగులకు చేరింది. గోదావరి ఉద్ధృతి పెరగడం వల్ల కాపర్‌డ్యాం నీట మునిగింది. పలుచోట్ల గండ్లు పడ్డాయి. కొంతసేపటికే కాపర్‌డ్యాం కనిపించకుండాపోయింది.
రాత్రికి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద పరిస్థితిపై సమీక్షించామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తారని మంత్రి పువ్వాడ అన్నారు. భద్రాచలం వద్ద రాత్రికి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. గోదావరిలో 2నెలల పాటు ప్రవాహం కొనసాగవచ్చు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గతేడాది 61 అడుగుల ఎత్తు వరద వచ్చినా ఎదుర్కొన్నామన్నారు.
ఇదీ చూడండి: telangana floods: మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...