గత కొంతకాలంగా బొగ్గు కొరత ఉన్నా తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థలు ఒక్కో రోజు 2 నుంచి 5 మిలియన్ యూనిట్ల (ఎంయూ) కరెంటును మార్కెట్లో విక్రయిస్తున్నాయి (Telangana power companies for selling electricity). తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు మిగులు విద్యుత్తును అధిక ధరలకు ఇంధన ఎక్స్ఛేంజీలో అమ్మడం వల్ల బొగ్గు కొరత తీర్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇలా అమ్ముతున్న రాష్ట్రాలకు నోటీసులు జారీచేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది (Center government issues notice to Telangana). తెలంగాణ మిగులు విద్యుత్తు అమ్ముతుండగా చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ లోటు ఉందని తెలిపింది.
తీరని కొరత...
దేశంలో గత నెల రోజులుగా బొగ్గు కొరత ఉంది. దీనివల్ల పలు థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి పెరగడం లేదు. దేశంలోని 135 థర్మల్ కేంద్రాల్లో ఒకరోజు పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి సామర్థ్యం 1.65 లక్షల మెగావాట్లు కాగా వీటిలో 1.27 లక్షల మెగావాట్ల సామర్థ్యం గల 104 కేంద్రాల్లో 0-8 రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. అయిదు రోజుల అవసరాలకు మించి నిల్వలున్న కేంద్రాలకు సరఫరా తగ్గించి, అంతకన్నా తక్కువ ఉన్న వాటికి పెంచాలని బొగ్గు గనుల యాజమాన్యాలకు కేంద్రం ఇటీవల సూచించింది. మిగులు విద్యుత్ ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గించి, కొరత ఉన్న ప్రాంతాలకు బొగ్గును తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
కొత్తగూడెం 800 మె.వా. కేంద్రంలో సమస్య
కొత్తగూడెంలోని 7వ దశ కొత్త విద్యుత్కేంద్రంలో బాయిలర్ ట్యూబు లీకేజీ వల్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీని సామర్థ్యం 800 మె.వా. కావడంతో రాష్ట్రంలో మిగులు విద్యుత్ పెద్దగా లేదని, ఇక ఇంధన ఎక్స్ఛేంజీలో అమ్మకాలు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ గరిష్ఠ డిమాండు 9615 మెగావాట్లుంది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు 6601 మెగావాట్లే ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి: Coal Supply to Power Stations : సింగరేణి కీలక నిర్ణయం.. ఆ ప్లాంట్‌కు బొగ్గు సరఫరాలో కోత