భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో మైలురాయిని చేరుకుంది. 1080 మెగావాట్లతో నిర్మితవుతోన్న విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డే(సీవోడీ)ని సోమవారం నిర్వహించారు. జెన్కో డైరెక్టర్లు సచిదానందం, లక్ష్మయ్య, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ గణపతి సమక్షంలో సీవోడి ప్రక్రియను పూర్తి చేశారు. వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ వాణిజ్య ఒప్పందంపై జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు సంతకాలు చేశారు. రెండో యూనిట్ నుంచి 72 గంటల పాటు 270 మెగావాట్ల విద్యుత్ డిసెంబర్ 4 నుంచి నిర్విరామంగా ఉత్పత్తి కొనసాగడంతో సీవోడీ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు.
సీఎండీ అభినందనలు
బీటీపీఎస్ రెండో యూనిట్ సీవోడి పూర్తికావడంతో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అధికారులను, ఇంజినీర్లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన రెండు యూనిట్లు పూర్తి చేయాలన్నారు. మూడో యూనిట్ సీవోడీ ఈ నెలాఖరులోపు, నాలుగో యూనిట్ వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మొదటి యూనిట్ సీవోడీ అనంతరం వచ్చే సమస్యల్ని అధిగమించాలని సూచించారు.
ఇదీ చదవండి: ప్రతి పల్లె ఆ గ్రామంలా కావాలని కేసీఆర్ సూచన