భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా మార్చి 20 నుంచి రామాలయంలో దర్శనాలు ఆగిపోయాయి. 70 రోజుల అనంతరం జూన్ 8న దర్శనానికి గుడి తలుపులు తెరుచుకోనున్నాయి. దేవాదాయ శాఖ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దర్శనాలకు రోజుకు ఎంత మందికి అవకాశం కల్పించాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. భక్తులు మాస్కులు విధిగా ధరించి.. భౌతిక దూరం పాటించాలని అధికారులు నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వద్దకు రాగానే శానిటైజేషన్ చేయాలనే నిర్ణయాలను తీసుకోనున్నారు.
స్వామి వారి హుండికీ గండి కొట్టిన కరోనా..
ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత దర్శనం వరకే అనుమతిస్తారా లేదా పూజలు చేసుకోవడానికి వీలుందా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. పూజలకు అవకాశం ఇస్తే ఆలయ ఖజానాకు ఆదాయం పెరగనుంది. భక్తులకూ ఆథ్యాత్మిక ఆనందం కలిగే వీలుంది. 70 రోజుల నుంచి ఆర్జిత సేవలు రద్దు చేయడం వల్ల స్వామి వారి ఖాతాకు గండి పడింది.
కేంద్ర రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారమే !
రోజుకు మూడు నుంచి పది లక్షల వరకు ఆదాయం సమకూరేది. కరోనా వల్ల ఈ ఆదాయానికి మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే ప్రసాదాల విక్రయంపై స్పష్టత వస్తుందని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు. దేవాదాయ శాఖ మార్గదర్శకాలను ఇచ్చిన తర్వాత దర్శనాలను కల్పిస్తామని చెప్పారు. దేవాదాయ శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయం తెరవటానికి సిద్ధంగా ఉన్నామని ఈవో వెల్లడించారు.