భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహణ జరిగింది. ఆలయ ఈఓ శివాజీ పర్యవేక్షణలో గత 152 రోజులుగా భక్తుల ద్వారా హుండీలో వచ్చిన ఆదాయం లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 66,51,895, బంగారం 80 గ్రాములు, వెండి 1200 గ్రాములు వచ్చాయి. వీటితో పాటు 83 అమెరికన్ డాలర్లు, ఇండోనేషియా రూపాయలు 1000, యూఏఈ దిరామ్స్ 170, సింగపూర్ డాలర్లు 7, ఒమాన్ బైసా 100.. స్వామివారికి కానుకలుగా వచ్చాయి.
గతంలో భద్రాద్రిలో ప్రతి నెలా హుండీ ఆదాయాన్ని లెక్కించేవారు. కరోనా కారణంగా 152 రోజుల నుంచి ఆదాయం లెక్కింపు నిర్వహించలేదు. లాక్ డౌన్ ముందు హుండీల ద్వారా ప్రతి నెల ఆదాయం రూ. 60 లక్షల నుంచి 80 లక్షల వరకు వచ్చేదని కానీ ఈ సారి గణనీయంగా తగ్గిపోయిందని ఆలయ ఈవో వెల్లడించారు. ఒక నెలలో వచ్చే ఆదాయం ప్రస్తుతం 5 నెలలకు రావడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా ఆంక్షల్లో ప్రభుత్వం సడలింపు చేయడం వల్ల ఈ నెల నుంచి ఆదాయం పెరగవచ్చని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిస్తాం: మంత్రి పువ్వాడ