రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికుల వేతనాల్లో చేసిన మినహాయింపులను ఇప్పించడంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని విఠల్ రావ్ భవన్ లో వారు సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ప్రభుత్వం లాక్డౌన్ అమలుతో అన్ని పరిశ్రమలు మూసి వేసినప్పటికీ అత్యవసర సేవల పరిస్థితుల్లో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులకు హాజరైన కార్మికుల వేతానాల్లో కోత విధించడం సబబు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాజమాన్యం మార్చి నెల వేతనంలో 50 శాతం మినహాయింపు చేయడం అన్యాయమని వాపోయారు. . రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదంటే అది సింగరేణి కార్మికుల కృషే అని వారు పేర్కొన్నారు. కార్మికులు చీకటి సూర్యులుగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం విధులు నిర్వర్తిస్తే వేతనంలో మినహాయింపు చేయడం దారుణమన్నారు. నేడు సింగరేణి వ్యాప్తంగా 650 మంది కార్మికులు కరోనా బారినపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే మినహాయింపు వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'