దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతూ దేశవ్యాప్తంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న భద్రాద్రి శ్రీ సీతారాముల వారి దివ్యక్షేత్రంపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. 1674లో భక్తరామదాసు రాములవారి ఆలయాన్ని నిర్మించగా... నాటి నుంచి ఏనాడు స్వామి వారి ధూపదీప నైవేథ్యాలకు కొదవలేకుండానే సాగింది. ఎన్ని కష్టాలు ఎదురైనా.. దండయాత్రల రూపంలో అవాంతరాలు ఉత్పన్నమైనా... ఆలయ ముఖద్వారాలు ఇంతకాలంపాటు మూసివేసిన సందర్భాలు లేనే లేవు. లాక్డౌన్ కారణంగా.. వేదమంత్ర ఉచ్ఛరణలు లేక, నిత్యపూజ కార్యక్రమాలు ఊసెత్తక.. దాదాపు 76 రోజులుగా పుణ్యక్షేత్రంలో నిశబ్దం రాజ్యమేలుతోంది. వేకువజామునే సుప్రభాత సేవతో మొదలయ్యే రాములోరి పూజలు, అర్చనలు, అభిషేకాలు, నిత్యకల్యాణాల కైంకర్యాలు లాంటి కార్యక్రమాలు నెలల తరబడిగా నిలిచిపోయాయి.
ఆదాయపరంగా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న భద్రాద్రి ఆలయం.... లాక్డౌన్ పుణ్యమా అని మరింత కష్టాల్లోకిి వెళ్లింది. ప్రభుత్వాల ఆదరణ కరవైనా... భక్తుల సౌకర్యార్థం నెట్టుకొస్తున్న దివ్యక్షేత్రం... కరోనా కాటుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. సాధారణంగా రోజు వారీగా 3 లక్షల వరకు ఆదాయం వస్తుండగా... వారాంతాల్లో రెట్టింపు స్థాయిలో ఆదాయం ఉంటుంది. రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది వరకు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో నిత్యకల్యాణాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినా.... ఆశించిన మేర స్పందన రాలేదు.
దేశంలోనే వైభవోపేతంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు సైతం నిరాడంబరంగా జరిగాయి. ఆలయాన్నే నమ్ముకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులు, ఉద్యోగులు, సిబ్బంది జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కరోనా వేళ... భద్రాద్రి ఆలయం దాదాపు 6 కోట్ల మేర నష్టం మూటగట్టుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
లాక్డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా ఈ నెల 8న ఆలయాలు తెరుచుకోవచ్చని కేంద్రం ఇచ్చిన సూచనలతో... భద్రాద్రిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 78 రోజుల తర్వాత భక్తులకు రాములోరి దర్శనభాగ్యం కలుగనుంది. కరోనా దృష్ట్యా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై భవిష్యత్లో పూర్తి స్థాయిలో మార్పులు కనిపించనున్నాయి. దేవాదాయ శాఖ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దర్శనాలకు రోజుకు ఎంత మందికి అవకాశం కల్పించాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. భక్తులు మాస్కులు విధిగా ధరించి... భౌతిక దూరం పాటించాలని అధికారులు నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వద్దకు రాగానే శానిటైజేషన్ చేయాలనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇంకా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత దర్శనం వరకే అనుమతిస్తారా లేదా పూజలు చేసుకోవడానికి వీలుందా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చూడండి: నిద్రిస్తున్న వ్యక్తిపై దుండగుల దాడి.. నగదు, బంగారం చోరీ