వారికి అడవులే ప్రపంచం.. అదే వారి జీవనాధారం. పట్టణాలు, నాగరికతతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్న వారి భవిష్యత్తు మనుగడ ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులు గ్రామాలు వదిలి నగరాలకు వెళ్లాలని ప్రాజెక్టు అధికారులు సూచించగా వారు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు.
నిర్వాసితులుగా నాలుగు లక్షల మంది ప్రజలు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోలవరం వద్ద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 170 అడుగుల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగు లక్షల మంది గిరిజన, గిరిజనేతర ప్రజలు నిర్వాసితులు కానున్నారు.
రామయ్య సన్నిధికు ప్రాజెక్టు ముప్పు
భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రంలోని ప్రజలు నిర్వాసితులు కానున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి రామయ్య సన్నిధికి ముప్పు వాటిల్లనుంది.
ఏమీ తోచని స్థితిలో నిర్వాసితులు
ఏటా వర్షాకాలంలో నీటిమట్టం 50 అడుగులు దాటితే భద్రాచలం పట్టణానికి వరద వస్తోంది. పోలవరం పూర్తయితే భద్రాద్రిలో 70 అడుగుల నీటిమట్టం ఉంటుంది. ఇదే జరిగితే.. భద్రాచలం శివారు కాలనీలన్నీ నీట మునుగుతాయి. అక్కడ నివసించే ప్రజలు ఎటువైపు వెళ్లాలో.. ఎక్కడ తలదాచుకోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించాలని.. లేకపోతే నిర్మాణాన్ని ఆపివేయాలని నిర్వాసిత ప్రజలు, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చూడండి: ఈనెల 6 నుంచి శాసనసభ సమావేశాలు.. 8న బడ్జెట్..