అరవై నిమిషాలు... 20 వేల మంది జనం... 110 ఎకరాల అటవీభూమి... మూడున్నర లక్షల మొక్కలు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా... ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన వన మహోత్సవం వన జాతరను తలపించింది.
బర్త్ డే స్పెషల్
ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని... చేపట్టిన మూడున్నర లక్షల మొక్కలు నాటే కార్యక్రమం... వన మహోత్సవంలా సాగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలొచ్చిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అథితిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ సహా.. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల సమక్షంలో... గంట వ్యవధిలో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా సాగింది.
సానుకూల స్పందన
ఎంపీ జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే జోగు రామన్న చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూల స్సందన లభించింది. స్థానిక దుర్గానగర్‌లోని 110 ఎకరాల అటవీ భూమిలో గంట వ్యవధిలో 3.50 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగింది.
సైరన్ మోగగానే షురూ
టర్కీ దేశంలో గంట వ్యవధిలో 3.03లక్షలు మొక్కలు నాటగా... ఆ చరిత్రను తిరగరాయాలనే లక్ష్యంతో... జోగు ఫౌండేషన్ 3 లక్షల 50వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేపట్టింది. జోగినిపల్లి సంతోష్ నేతృత్వంలో ఉదయం 11 గంటల 11నిమిషాలకు సైరన్ మోగించగానే... దాదాపుగా 20 వేల మందికి పైగా జనం మొక్కలు నాటడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల వరకు మూడున్నర లక్షలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు.
భవిష్యత్ తరాల కోసం
ప్రతి మొక్కను కాపాడాలని ఎంపీ సంతోష్ కుమార్ సూచించారు. తాను రాజకీయ ఉపన్యాసకుడిని కాదని పేర్కొన్న సంతోష్‌కుమార్.... ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు, చేస్తున్న పనులు... దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. హరితహారం కోసం ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.6 వేల కోట్లు వెచ్చించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించగా... భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందనే సదుద్ధేశంతోనే... గంట వ్యవధిలో 3.50లక్షలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ఏడేళ్లలో ఆరు శాతం
ఉమ్మడి రాష్ట్రంలో అంతరించి పోయిన అడవులకు పూర్వవైభవం తీసుకువచ్చి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ వెల్లడించారు. ఏడేళ్ల వ్యవధిలో పచ్చదనం 6 శాతం పెరిగిందన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో పచ్చదనం తగ్గుతుంటే... కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పెరుగుతోందనీ పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: