Insurance fraud in Asifabad: డబ్బుల కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి కొందరు రెడీగా ఉంటారు. కొందరేమో అయిన వాళ్లను మోసం చేసి డబ్బు సంపాదిస్తే.. మరికొందరు ఏకంగా బీమా డబ్బులు కోసం కుటుంబ సభ్యులను చంపేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బతికుండగానే.. అతడు చనిపోయినట్లు చిత్రీకరించి. .ఏకంగా అతడి పేరుపై మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఆ వ్యక్తి ఖాతాలో ఉన్న బీమా డబ్బులు దోచేసిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
సాధారణంగా బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. అన్ని నిబంధనలు సక్రమంగా పూర్తి చేయాలి. ముఖ్యంగా సదరు వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కావాలి. ఆ పత్రాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మరణించిన వ్యక్తిపై ఉన్న బీమా డబ్బు తీసుకునే హక్కు కేవలం అతడికి నామినీగా ఉన్న వ్యక్తికి మాత్రమే ఉంటుంది. వేరే వారు ఆ డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ అలా జరగలేదు. వ్యక్తి బతికుండగానే అతడు మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం సృష్టించి అతడి బీమా డబ్బులు కొట్టేశాడు మరో వ్యక్తి. బాధితుడు తన ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం వెళ్లగా అతడి డబ్బు ఎవరో కాజేశారని తెలుసుకుని షాకయ్యాడు.
కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం కేంద్రం అంబేడ్కర్ కాలనీకి చెందిన కోట రాజన్న భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతి సంవత్సరం రాజన్న తన పేరుమీద లేబర్ ఇన్సూరెన్స్ చేయిస్తూ వస్తున్నాడు. ఎప్పటిలాగే ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం మీసేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన విషయం తెలుసుకుని నిర్గాంతపోయాడు.
ఎవరో తన పేరు మీద ఉన్న బీమా డబ్బును క్లెయిమ్ చేసుకున్నారని తెలిసి షాకయ్యాడు. వెంటనే ఆ పని ఎవరు చేశారో తెలుసుకోవడానికి కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లాడు రాజన్న. అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి అరా తీయగా విస్తుపోయే విషయం తెలుసుకున్నాడు. తాను చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారన్న విషయం తెలుసుకున్నాడు. తన ఇన్సూరెన్స్‌ను ఎవరో కాజేశారని రాజన్న అధికారులకు ఫిర్యాదు చేశాడు. తాను బతికి ఉండాగానే మరణ ధ్రువీకరణ ఎలా చేశారని అధికారులను ప్రశ్నించాడు. ఎవరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారో విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
ఇవీ చదవండి: