ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భానుడి భగభగలతో అగ్నిగోళాన్ని తలపిస్తోంది. వారం పది రోజులుగా సగటున 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్‌లో ఏకంగా 46.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదుకాగా... ఆదిలాబాద్‌లో 45.2 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 45.3 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తరాది ప్రభావంతో
గత వారం రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడి ఎండలకు తోడు ఉత్తరాది నుంచి బలంగా వీస్తున్న వేడిగాలులతో జనం బెంబేలెత్తుతున్నారు. పగటిపూట జనం బయటకు రావడానికే జంకుతున్నారు. చెట్ల కొమ్మల మధ్య ఉండే పక్షులు, మూగజీవాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది.
ప్రయాణాలు వాయిదా
ఎండ తీవ్రత బాగా పెరిగిపోవటం వల్ల జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల మీద వెళ్లినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.
ఎండల తీవ్రత మరో 15 రోజులపాటు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: పేదల ఆకలి తీర్చే.. సర్వ్ నీడీ