ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం తరలివచ్చింది. పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు గాను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావు ఇచ్చోడ మండలం జామిడి గ్రామాన్ని సందర్శించారు. వైకుంఠధామం, ప్రకృతివనంతో పాటు ఎరువుల తయారీ కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించారు.
గ్రామసభ నిర్వహించి ప్రజల భాగస్వామ్యం గురించి ఆరా తీశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాలో జరుగుతున్న పనులను వివరించారు. జామిడి గ్రామం నుంచి బయలుదేరే క్రమంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు అధికారుల వాహనశ్రేణికి అడ్డంగా పడుకుని తమను విధుల్లోకి తీసుకోవాలని నిరసన తెలపగా.. స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఆయన్ను పక్కకు తప్పించగా.. వాహనాలు ముందుకు కదిలాయి.
అనంతరం కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అధికారయంత్రాంగంతో సమావేశమయ్యారు. పల్లెల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎంపీఓల తనిఖీలపై పర్యవేక్షణను మరింత ముమ్మరం చేయనున్నట్లు స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: అధికారంలోకి రాగానే... నల్ల చట్టాలను రద్దు చేస్తాం: భట్టి