రైతులు చేస్తున్న ఆందోళనకు తాను వ్యతిరేకం కాదని... ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. ఆందోళన కంటే రైతులు సంఘటితమై సేంద్రియ సాగు చేయాల్సిన అవసరమెంతో ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్‌లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు చేస్తున్న రైతు కుటుంబాల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా మోహన్ భగవత్ హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వచ్చిన వెయ్యి మంది రైతు దంపతులు ఈ సమ్మేళనంలో పాల్గొనగా.. పలువురు అభ్యుదయ కర్షకులు తమ అనుభవాలను వివరించారు.
ఆదిలాబాద్, నిజామాబాద్ భాజపా ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్ హాజరు కాగా... ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో పాటు ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఆధ్యాత్మిక గురువు నారాయణ బాబా వేదికపై ఆసీనులయ్యారు. రైతు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమి లేదని భగవత్ వాఖ్యానించారు. ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం సాగు చేసేలా స్వర్ణయుగం రావాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:పోలీసుల తీరుపై డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.!