రెండుపడక గదుల ఇళ్లు కేటాయింపు వ్యవహారం అధికార పార్టీ ఎమ్మెల్యేకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, మండల సమైక్య భవనాన్ని సందర్శించి తిరిగి వెళ్తున్న బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావును పిప్పల్దరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు అడ్డుకున్నారు. తమకు ఇప్పటికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.
ఇల్లు కట్టి ఇస్తామంటేనే ఓట్లు వేసి గెలిపించామని.. ఇప్పుడు ఎందుకు వాటిని మంజూరు చేయడం లేదంటూ.. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చి ఇప్పటికి నాలుగేళ్లు దాటిందని.. అయినా ఇళ్ల సంగతినే మర్చిపోయారని ఆందోళన చేశారు. తొలుత ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరోనా మహమ్మారి వల్ల ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని.. అందువల్లే కేటాయింపుల్లో కూడా ఆలస్యమవుతోందని తెలిపారు. ఎంత చెప్పినా వినకపోగా.. ఎమ్మెల్యేను నిలదీస్తుండటం వల్ల అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. తమను తోసుకుంటూ ఎమ్మెల్యే వెళ్లిపోవటంపై మహిళలు మండిపడ్డారు. ఇందుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
"ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు.. అన్ని హామీలు ఇస్తారు. ఫొటోలు తిగుతారు. కాళ్లు, గడ్డం పట్టుకుంటారు. గెలిచి కుర్చి ఎక్కిన తర్వాత.. ఇక మేం కళ్లకే కనిపించం. 2018 నుంచి ఇప్పటివరకు ఇళ్ల గురించి ప్రస్తావనే లేదు. గతేడాది కరోనా వచ్చిందనుకుందాం. మరి మిగతా రోజుల్లో ఏమైంది..? ఇప్పుడేమైందని అడుగుతుంటే.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్నారు." - పిప్పిరి మహిళ
ఇవీ చూడండి: