Osteoporosis in Adilabad student: ఈ విద్యార్థి భవిష్యత్తును ఎముకల అరుగుదల వ్యాధి చిదిమేసింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన అండ్రెడ్డి లింగారెడ్డి, పుష్పలత దంపతుల కుమారుడు లోకేష్‌రెడ్డి(19) మూడో తరగతి చదువుతున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వైద్యునికి చూపించారు. కుడికాలులో ఎముకల బలహీనత అని చెప్పడంతో మందులు వాడారు.
అలా ఆ విద్యార్థి ఇబ్బంది పడుతూనే 8వ తరగతి వరకు చదివాడు. నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చూపించగా కీళ్లవాతంతో పాటు కుడి కాలుకు ఎముకల అరుగుదల వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఉన్న రెండెకరాల భూమిని విక్రయించి వైద్యం కోసం మూడేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటూ అక్కడే కూలి పనులు చేస్తూ కుమారుడికి చికిత్స చేయిస్తున్నారు.
ఎముకల అరుగుదలను నిరోధించడానికి ప్రతి నెలా రూ.32 వేల ఇంజెక్షన్ ఇప్పిస్తున్నారు. శస్త్రచికిత్స చేయిస్తే వ్యాధి నయమవుతుందని.. ఇందుకు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. మానవతావాదులు, దాతలు స్పందించి కుమారుడికి కొత్త జీవితాన్ని అందించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి :