CCI Protest in Adilabad: మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్‌లో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈనెల 4న ఆదిలాబాద్‌లో బంద్ నిర్వహించగా.. ఇవాళ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం జందాపూర్ బైపాస్ వద్ద 44 జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, సాధన కమిటీ కన్వీనర్ మల్లేశ్ సహా భారీగా స్థానికులు తరలివచ్చారు. భాజపా మినహా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపైనే ఆట, పాటలతో ఆందోళన చేపట్టారు. ఫలితంగా హైదరాబాద్- నాగపూర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపుల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గల్లీలో ప్రారంభమైన ఉద్యమం.. దిల్లీవరకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు. సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సిమెంట్ పరిశ్రమను కాపాడుకొనేందుకు భాజపా నేతలు, శ్రేణులు కలిసిరావాలని కోరారు.
'2014 ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం వస్తే.. సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని భాజపా నేతలు హామీ ఇచ్చారు. 2018లో.. ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని సోయం బాపూరావు చెప్పారు. ఆ హామీనే నెరవేర్చాలని కోరుతున్నాం. మీకు చేతకాకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఎన్ని కోట్లైనా సిమెంట్ పరిశ్రమను కాపాడుకుంటాం.'
- జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
'ఈ ఆందోళన కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకం కాదు. కేవలం సిమెంట్ పరిశ్రమను కాపాడుకొనేందుకే. నాడు ఇచ్చిన హామీనే అమలుచేయాలని కోరుతున్నాం. అమలుచేయకుంటే మూల్యం చెల్లించక తప్పదు.
- దర్శనాల మల్లేశ్, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్
ఇదీచూడండి: Bandi sanjay Fire On KCR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది..