ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న నిరుపేదలపై అటవీ శాఖ జులుం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి రాఠోడ్ బాపూరావు, అదనపు పాలనాధికారులు సంధ్యారాణి, డేవిడ్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉన్నవి పరిష్కరించాల్సింది పోయి..
ముఖ్యమంత్రినే కాదన్నట్లుగా అటవీశాఖకు దిశానిర్దేశం ఎవరు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. వివాదస్పద భూముల అంశాన్ని పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
వేడెక్కిన సమావేశం
ఉపాధి కల్పన, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా పొరుగుసేవల ఏజెన్సీలను ఎంపిక చేసుకోవడంలో ఆంతర్యమేంటని జడ్పీటీసీ సభ్యులతో పాటు మండల అధ్యక్షుడు నిలదీయడం వల్ల సమావేశం వేడెక్కించింది.
కంగుతిన్న అధికారులు..
ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యుల నుంచి ఊహించని రీతిలో అభ్యంతరాలు రావడం వల్ల కంగుతిన్న అధికారులకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్ ఆదేశించారు.
వారిపై శాఖాపరమైన చర్యలు..
సర్వసభ్య సమావేశానికి చెప్పకుండా గైర్హజరైన జిల్లా అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సెలవుపై వెళ్లిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని సమావేశం తీర్మానించింది.