ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని 13 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురువారం రాత్రి ఆహారం తిని పడుకునేముందు కొంత మంది కడుపు నొప్పితో బాధపడడం వార్డెన్ గమనించారు. వెంటనే వారందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆదివాసి మహిళా సంఘం నేతలు.. ఆస్పత్రికి, కేజీబీవీకి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. వెంటనే ఐటీడీఏ పీవో, ఆర్డీవో వినోద్ కుమార్, ఎస్సై నరేష్ కుమార్కు సమాచారం అందించారు.
ఆస్పత్రికి వెళ్లిన అధికారులు విద్యార్థుల ఆరోగ్య స్థితిపై వాకబు చేశారు. కారణాలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రతిసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తెలిపారు. తాగు నీటికి సైతం ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. మరుగుదొడ్లు సరిగ్గా లేవన్నారు. సమస్యలపై ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోందని విద్యార్థులు వాపోయారు.
ఇవీచూడండి: 'మహిళలపై పోలీసుల దాష్టీకాలు... రేపు అమరావతి బంద్'