గత నాలుగు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు యూరియా బస్తాల కోసం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు యూరియా కావాలంటే అవసరం లేని మందు బస్తాలను అంటగట్టడంతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆశ్రయిస్తున్నారు.
ఇదే క్రమంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని తంతోలి, భీంసరి, అనుకుంట, అంకోలి, పిప్పల్‌ధరి, రామాయి, యాపల్‌గూడ, కచ్‌కంటి రైతులంతా యూరియా కోసం గోదాము వద్దకు తరలివచ్చారు.
యూరియా బస్తాలు తక్కువగా ఉండటం.. వచ్చిన రైతులు ఎక్కువగా ఉండటంతో తొలుత ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ ప్రారంభించారు. ముందువరుసలో ఉన్న వారు తమకు ఇచ్చే రెండు బస్తాలు సరిపోవని, మరిన్ని బస్తాలు ఇవ్వాలని పట్టుబట్టడంతో రైతుల మధ్య వాదులాటకు కారణమైంది. పంచాయతీ ఏటూ తేలకపోవడంతో పీఏసీఎస్ సిబ్బంది గోదాం మూసి తిరుగుముఖం పట్టారు. ఫలితంగా ఉదయం నుంచి పడిగాపులు కాచిన తమకు యూరియా బస్తాలు దక్కకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!