Cotton crop in Adilabad district: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులను దగా చేయడం షరా మాములుగానే సాగుతోంది. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోకపోవడంతో వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన కర్షకులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.
రూ.2000 తగ్గిపోయిన పత్తి ధర: పత్తి క్రయవిక్రయాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. గత అక్టోబర్ 14న కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఒక్కరోజు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదు. గత సంవత్సరం క్వింటాల్ పత్తి ధర రూ.9,500పైగా పలికితే ఈ ఏడాది ఏకంగా రూ.7,500కి పడిపోయింది. రైతులు అమ్మకానికి తెచ్చే పత్తిని తమ ద్వారానే కొనుగోళ్లు చేయాలని, లేకుంటే తమకు రావాల్సిన కమీషన్ రాకుండా పోతుందనే ఆలోచనతో కమీషన్ ఏజెంట్లు ఆందోళనకు దిగడం ప్రతిష్టంభనకు దారితీసింది. భారీగా వచ్చిన పత్తి వాహనాలన్ని యార్డులోనే వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పడింది. జోక్యం చేసుకున్న అధికారులు.. రైతుల సమక్షంలో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సంప్రదింపులు చేయడంతో కొనుగోళ్లు ప్రక్రియ ప్రారంభమైంది.
దాదాపు రెండన్నర గంటల పాటు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల ప్రయోజనాలపై చర్చించిన అధికారులు రైతులకు ఇవ్వాల్సిన ధరపై నోరు విప్పలేదు. పైగా పత్తి రైతులకు మంచి ధరనే ఇస్తున్నట్లు అధికారులు వకల్తా పుచ్చుకోవడం విస్మయానికి గురిచేసింది. కేంద్రం ప్రకటించి మద్దతు ధర 6,380 కంటే ఎక్కువగా ఉందనే సాకుతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు చేస్తున్న దోపిడిని పట్టించుకోవడంలేదు. మార్కెట్‌లో అడుగడుగునా దగాకు గురవుతున్న రైతుల గోడును ప్రజాప్రతినిధులు తేలిగ్గా తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల హవానే కొనసాగుతోంది.
"పంట విక్రయం రైతులు ఆపలేదు. ఎజెంట్లు వాళ్ల కమిషన్ కోసం ఆపి వేస్తున్నారు. వాళ్లు ముందు రైతులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. అసలు ఏ కర్షకుడితోను మాట్లాడలేదు. మా తరుఫునే అమ్మాలి అని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ల కమిషన్ వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం."-రాజేశ్వర్, పత్తి రైతు
"రైతులు ఎటువంటి నష్టపోరు. మంచి ధర వస్తుందని వాళ్లకు మేము సూచించడం జరుగుతోంది. రైతులు కమిషన్ ఇచ్చేది కమిషన్ ఏజెంట్ వ్యక్తి ఏ విధంగా చెబితే ఆ విధంగా ఉండడానికి. అందుకే కమిషన్ ఏజెంట్ ఏ విధంగా చెబితే ఆ విధంగా వారు నడుచుకుంటారు."-వెంకట్, మార్కెట్ కమిటీ కార్యదర్శి
ఇవీ చదవండి: