ఆసరా పింఛన్లకు 57 ఏళ్లు నిండిన అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో మీ సేవ కేంద్రాల వద్ద అప్పుడే హడావుడి మొదలైంది. ఈ నెల 31 వరకు గడువు విధించడంతో సంబంధీకులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో గుర్తించిన 10,531 మందితో సహా అర్హులైన ప్రతి ఒక్కరూ మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
మూడేళ్లుగా వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. ఇది వరకు 65 ఏళ్లు నిండిన వారికే వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేది. ఆ వయసును 57 ఏళ్లకు కుదిస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకోగా.. జిల్లా యంత్రాంగం 10,531 మంది అర్హులుగా ఉన్నట్లుగా గుర్తించింది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అనర్హులు ఎవరంటే?
దరఖాస్తుదారు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలు మించొద్ధు. దరఖాస్తుదారు పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబంలో ఇది వరకే పింఛను పొందుతుంటే మరొకరు అనర్హులుగా తేల్చుతారు. విచారణ సమయంలో ఇవన్నీ చూశాకే అర్హులను గుర్తిస్తారు. ఆ తర్వాతే పింఛను మంజూరవుతుంది.
భారీగా వచ్ఛి..
ఆసరా పథకం కింద కొత్తగా వృద్ధాప్య పింఛన్లు దరఖాస్తు చేసుకునేందుకు బేల మీసేవ కేంద్రంలో జనం బారులు తీరుతున్నారు. కొంత మందికి ఆధార్‌కార్డు, ఓటర్‌ఐడీ కార్డులో వయసులో తేడాలుండటంతో వయసు నిర్ధరణ పత్రం కోసం చదువుకున్న పాఠశాలకు ధ్రువీకరణ పత్రాల కోసం వెళ్తున్నారు.
దరఖాస్తు ఇలా..
ఈ నెల 31తో 57 ఏళ్లు నిండిన వారంతా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు. సంబంధీకులు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి తగు ఆధారాలతో దరఖాస్తు చేయాలి. వయసు నిర్ధరణకు పంచాయతీ, మున్సిపల్ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రాలు లేదా గతంలో చదివిన విద్యాసంస్థలు జారీచేసిన పత్రాలు, లేదంటే ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించాలి. దరఖాస్తుకు ఆధార్‌కార్డు, వయసు నిర్ధరణ పత్రంతో పాటు బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్టుసైజ్ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
సర్వీసు ఛార్జీ వసూలు చేయొద్దు
ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే వారి నుంచి ఎలాంటి సర్వీసు ఛార్జీలు వసూలు చేయొద్ధు. మీ సేవ కేంద్రాలకు ప్రభుత్వమే ఆ రుసుం చెల్లిస్తుంది. తదుపరి ఆదేశాల తర్వాత దరఖాస్తుల విచారణ, పింఛను మంజూరుకు చర్యలు తీసుకుంటాం. - ఎస్.కిషన్, డీఆర్‌డీవో
ఇదీ చదవండి: LAND ALLOCATION: ఉగ్రదాడిలో మరణించిన అధికారి భార్యకు భూమి కేటాయింపు