వైద్యుల కొరతతో ఆదిలాబాద్ రిమ్స్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా ప్రతి విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో నలుగురు సీనియర్ రెసిడెంట్లు ఉండాలనేది వైద్యకళాశాల పాటించాల్సిన ప్రాథమిక నిబంధన. రిమ్స్‌లో అలాంటి నిబంధనలేవీ ఆచరణకు రావడంలేదు. మొత్తం 98 మందిలో రెగ్యులర్ వైద్యులు 15కి మించిలేరు. మిగిలినవారంతా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నవారే. వీరిలో సీనియర్ల పనితీరును ప్రశ్నించేవారే లేరు. సమయ పాలనను అడిగేవారూ లేరు. వృత్తిపట్ల ఆసక్తితో జూనియర్లు చేసే వైద్యమే దిక్కవుతోంది.
శస్త్రచికిత్సలు బంద్
రిమ్స్‌లో ఆపత్కాలంలో చేయాల్సిన శస్త్రచికిత్సలు జరగడంలేదు. గైనిక్‌వార్డుకు ప్రసూతి కోసం వచ్చే గర్భిణీల పరిసితి దయనీయంగా మారుతోంది. ఆరో, గైనిక్, సర్జరీ, ఈఎన్‌టీ విభాగాల్లో సగటున రోజుకు 15 శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. గతకొంతకాలంగా మత్తు ఇచ్చే వైద్యులు అందుబాటులో లేక అవి జరగడంలేదు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఇద్దరు మత్తు మందు ఇచ్చే వైద్యులకు అర్హత ప్రకారం పదోన్నతి ఇవ్వలేదు. దాంతో వారు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మరో ఇద్దరు మత్తు ఇచ్చే వైద్యులను రిమ్స్‌కు డిప్యూటేషన్ కల్పించగా వారు ఇటీవల సెలవుపై వెళ్లడంతో దాదాపుగా నెలరోజులుగా శస్త్ర చికిత్సలు నిర్వహించడంలేదు. అత్యవసరమైనవారిని ప్రైవేటుకు తరలించే పరిస్థితి ఏర్పడుతుందనడానికి కెరమెరికి చెందిన ఓ గర్భిణిని వైద్యులు పట్టించుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. స్వతహాగా మత్తు మందు ఇచ్చే వైద్యుడే అయిన డీఎంహెచ్‌వో డా.నరేందర్ రాఠోడ్ ముందుకురావడంతో రెండురోజులుగా కొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. లేదంటే అంతేసంగతి.
ప్రజాప్రతినిధుల శీతకన్ను
ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్యకళాశాలకు ప్రభుత్వ పరంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిసితి నెలకొంది. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతో సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లడంలేదు. మంజూరైన వైద్యపోస్టులు ఏళ్లతరబడిగా భర్తీకావడంలేదు. ఫలితంగా చిన్నచిన్న రోగాలతో ఆస్పత్రికి వచ్చేవారిని సైతం మహారాష్ట్రకో, హైదరాబాద్ ఆస్పత్రులకో రిఫర్ చేయాల్సిన దుస్థితి.
ఆసక్తి చూపని వైద్యులు
ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని 2008లో 500 పడకలతో అప్పటి ప్రభుత్వం రిమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యసంజీవినిగా ఉండాలనే సదాశయంతో ప్రారంభంలో 155 వైద్యపోస్టులను మంజూరుచేసింది. ఇందులో 97 మందే విధుల్లో చేరారు. ఆ తరువాత 2017లో జీవో 78 ప్రకారం అదనంగా మరో 60 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఉద్యోగాల్లో చేరడానికి అర్హులైన వైద్యులు ముందుకురాక ఒకే ఒక్క పోస్టు భర్తీ అయింది. మిగిలిన 59 పోస్టులు భర్తే కాలేదు. అంటే మొత్తం 215 పోస్టులకుగాను కేవలం 98 మంది వైద్యులే అందుబాటులో ఉన్నారు. మారుమూలన ఉన్న రిమ్స్‌కు వచ్చే వైద్యులు స్థానికంగానే ఉండాలని అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలోనే మిగిలిన వైద్యకళాశాలలకంటే అత్యధిక వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదముద్ర లభించలేదు. పూర్తిసాయిలో వైద్యపోస్టులు భర్తీకానప్పటికీ ప్రారంభంలో ఉన్నవారితోనే కొంతకాలం ఏ ఇబ్బందీ తలెత్తకుండా కొనసాగింది. ఆ తరువాత ఉన్నవారిలో కొంతమంది వైద్యులు ఉన్నత చదువులకు వెళ్లడం, మరికొంతమంది పదవీ విరమణ చేయడంతో సమస్యలు తలెత్తడానికి కారణమైంది.
నిపుణుల కొరత
మెడిసిన్, సర్జరీ, పిల్లలు, మహిళలు, కన్ను, ముక్కు, చెవి, నేత్ర, బొక్కలు, చర్మ, మానసిక సమస్యలు వంటి కీలకమైన 21 విభాగాల్లో ప్రత్యేక నిపుణులైన వైద్యుల లేరు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడంతో వైద్యల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. ఉన్న వైద్యులు సైతం గ్రూపులుగా విడిపోవడంతో పాలన పూర్తిగా గాడితప్పింది.
పరిష్కారాలు ఇవిగో..
- వైద్యుపోస్టుల భర్తీకి అత్యవసరమైన చర్యలు తీసుకోవాలి.
- ఉన్న వైద్యుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఉండాలి.
- ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలి.
- వైద్యుల సమయ పాలనపై నిఘా పెట్టాలి.
- డిప్యూటేషన్లపై రిమ్స్‌కు వచ్చే వైద్యులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారా? లేదా? అని ఆరాతీయాలి.
- ప్రత్యామ్నాయ వైద్యులు ఉన్న తర్వాతే మిగిలిన వారికి సెలవులు ఇవ్వాలి.
- వైద్యుల మధ్య భేదాభిప్రాయాల్లేకుండా చూడాలి.
- కీలకమైన సర్జరీ, ఆర్థో, గైనిక్‌వార్డులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- విధానపరమైన అంశాలను నివేదికల రూపంలో ప్రభుత్వానికి సిఫారసు చేయడమే కాకుండా అమలయ్యేలా జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా పాలనాధికారి నేతృత్వంలో ఆచరణాత్మక విధానం అమలు చేయాలి.
ఇదీ చూడండి: నిలిచిన ప్రసూతి ఆపరేషన్లు... గర్భిణీల నరకయాతన