కొవిడ్ కేసుల్లో పొంతనలేని జిల్లా, రాష్ట్ర లెక్కలు - Differences in district and state covid calculations in adilabad
ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసుల లెక్క ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. జిల్లాస్థాయిలో నమోదవుతున్న కేసులకు, రాష్ట్రస్థాయిలో ప్రకటించే లెక్కకు పొంతన కుదరడంలేదు. ఫలితంగా ఏదీ సత్యం అనే అనుమానానికి దారితీస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా పంజా విసురుతోంది. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 3104 మంది వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం 589 మంది యాక్టివ్ కేసులుగా ఉన్నారు. ఇప్పటికే 33 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో కొవిడ్ పరీక్షల నిర్వహణను పెంచిన తరువాత భారీగా కేసులు నమోదవుతుంటే ... రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కల్లో చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి ఈనెల 17వ తేదీ వరకు జిల్లాస్థాయిలో జరిపిన పరీక్షల్లో 665 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కేవలం 187 కేసులుగానే ప్రకటించింది. దాంతో ఏదీ సత్యం... ఏదీ అసత్యం అనే ఆందోళనకు దారితీస్తోంది.
వ్యాధి విషయంలో రహస్యాలు ఉండకూడదనే పెద్దల మాట... కరోనా కేసుల లెక్కలు చూపించడంలో కనిపించడంలేదు. ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలకు దారితీస్తోంది. జిల్లాస్థాయిలో నమోదయ్యే కేసులన్నీ రాష్ట్రస్థాయికి చేరుతాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని కేసులను పరిగణలోకి తీసుకోకుండా తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటే... సమాధానం చెప్పడానికి అధికారులు ముందుకురావడంలేదు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 9 నుంచి ఈనెల 17వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించిన కరోనా పాజిటివ్ కేసుల వివరాల్లో తేడా ఇది
తేదీ | జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కేసులు | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించిన కేసులు |
09/09/2020 | 118 | 23 |
10/09/2020 | 89 | 25 |
11/09/2020 | 75 | 25 |
12/09/2020 | 64 | 24 |
13/09/2020 | 37 | 12 |
14/09/2020 | 89 | 20 |
15/09/2020 | 96 | 19 |
16/09/2020 | 23 | 20 |
17/09/2020 | 42 | 19 |
18/09/2020 | 33 | -- |
ఇవీ చూడండి: అందుబాటులోకి ఆర్టీఏ ఆన్లైన్ సేవలు.. వాహనదారులకు తప్పిన తిప్పలు