ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడంతో పాటు ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని దెబ్బ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వరకు ఆదివాసీలు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ప్రస్తుతం వారు సాగు చేస్తున్న భూములను లాక్కొని హరితహారం పథకం పేరిట మొక్కలు పెంచుతామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారని ఆరోపించింది.
ఏజెన్సీ ప్రాంతంలో హరితహారం పథకం కింద నాటిన మొక్కలకు శ్వేత పత్రం ఇవ్వాలనీ, నోటిఫైడ్ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని కమిటీ ప్రధాన కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షుడు గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుష బాబురావు డిమాండ్ చేశారు. వారి పోడు భూములకు పత్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆదివాసీల సమస్యలని పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, పాలనాధికారి వచ్చి సమస్యలు పరిష్కరించాలని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, సీఐలు అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమించేలా చేశారు.
ఇదీ చదవండి: పశువుల దాణా కొరత తీర్చేందుకు అగ్రిటెక్ సరికొత్త ప్రయోగం