ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనగా... దంపతులు మృతి చెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన లక్ష్మి, అంజి ఆదిలాబాదులో నివాసం ఉంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ వంట పాత్రలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
రోజూ మాదిరిగానే ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వస్తున్న సమయంలో... ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.