ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అధికారుల పనితీరుపై సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లాలో ప్రగతి పనులు కుంటుపడ్డాయని ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి పనులను పరిశీలించాలని సూచించారు. తాను చెప్పినవి తప్పైతే క్షమాపణలు చెబుతానని, అంతేగానీ మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాటలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తీవ్రంగా పరిగణించారు. పల్లె ప్రగతిలో జరిగిన నిర్మాణాలన్నీ రాత్రికిరాత్రే జరిగినవి కావని... అధికారుల సమన్వయలోపం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ జోక్యం చేసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాల్సిన అవసరముందని అన్నారు.
ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఆయాశాఖల ఉన్నతాధికారులూ హాజరుకాకపోవడం సభ్యుల ఆగ్రహానికి దారితీసింది.
ఇదీ చదవండి: గురుకులంలో కరోనా కలకలం.. మొత్తం 26 మందికి పాజిటివ్