ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు భారత పత్తి సంస్థ (సీసీఐ) సిద్ధంగా ఉంది. ఈ ఏడాది కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే జిన్నింగ్ మిల్లుల కోసం టెండర్లను ఆహ్వానించింది. టెండర్లలో పాల్గొనకూడదని రాష్ట్ర ప్రైవేటు జిన్నింగ్ అసోసియేషన్ నిర్ణయించినా ఇప్పటికే ఆదిలాబాద్‌లో ముగ్గురు, నార్నూర్, భైంసా, ఇంద్రవెల్లిలో ఒక్కో యజమాని తమ మిల్లులను అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఒప్పందం చేసుకోవడమే మిగిలింది. దసరా తరువాత కొనుగోళ్ల ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది.
అంతర్జాతీయ విపణిలో డిమాండ్
తెల్లబంగారంగా ప్రసిద్ధి పొందిన పత్తి పంటకు ఈ ఏడాది అంతర్జాతీయ విపణిలో మంచి డిమాండే ఉంది. ప్రస్తుతం ఒక్కో బేలు ధర రూ.56 వేల నుంచి రూ.58 వేలు పలుకుతోంది. పత్తి మద్దతు ధర రూ.6,026 ఉన్నా డిమాండ్ రీత్యా ఖమ్మం, ఇతర వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో క్వింటాలుకు రూ.6,600 పలుకుతోంది. ఈ లెక్కన అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తికి కనీసం రూ.200 అదనంగా ఉంటుందనేది వ్యాపార వర్గం అంచనావేస్తోంది. గతేడాది క్వింటాలు ధర రూ.5,825 ధర ఉండేది. నాణ్యత, తేమ కారణంగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకురాలేదు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల ద్వారా సీసీఐ ఏక పక్షంగా సగటున క్వింటాలుకు రూ.5,500 చొప్పున దాదాపుగా 52 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. రూ.4 వేల కోట్ల వ్యాపారం జరిగింది. వ్యాపారులు నాణ్యత, తేమ పేరిట అసలు కొనుగోళ్లకే నిరాకరించగా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి మద్దతు ధరతో సీసీఐ కొనుగోళ్లు చేయడంతో రైతులు నష్టపోలేదు. ఈ ఏడాది కూడా ప్రైవేటు వ్యాపారులు నిరాకరిస్తే సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు కసరత్తు జరుగుతోంది.
ప్రైవేటు ఎత్తుగడ
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉండటంతో మద్ధతు కంటే ఎక్కువ ధరే లభించే అవకాశం ఉంది. నాణ్యత, తేమ పేరు చెప్పి దానికంటే కొంత తక్కువ ధరతో కొనుగోలు చేసేందుకు వ్యాపార వర్గం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే దాదాపుగా నెలరోజుల కిందట సీసీఐ పిలిచిన టెండర్లలో జిన్నింగ్ మిల్లులను అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా కొనుగోళ్లలో చక్రం తిప్పే కీలకమైన కొంతమంది వ్యాపారుల జట్టు కట్టి కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొనేలా చేసే వ్యూహాత్మక వైఖరి ఆనవాయితీగా వస్తోంది. పైగా నాణ్యతతో ప్రమేయం లేకుండా క్వింటాలుకు ఓ ధర నిర్ణయించి గంపగుత్త (స్థానికంగా గూడ్‌గోనా పిలుస్తారు) కొనుగోళ్లు చేసే అనధికారిక నిబంధన కొనసాగుతోంది. తద్వారా నాణ్యమైన పత్తిని సైతం తక్కువ ధరకు విక్రయించడం ద్వారా రైతులు నష్ట పోవాల్సి వస్తోంది. గతేడాది సీసీఐ కొనుగోళ్లు చేయడం ద్వారా వ్యాపారుల వ్యూహం బెడిసికొట్టింది. ఈ ఏడాది సీసీఐని రంగంలో ఉండకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్, నార్నూర్, భైంసా, ఇంద్రవెల్లి యార్డుల పరిధిలో 9 జిన్నింగ్‌లను అద్దెకు తీసుకున్న సీసీఐ అవసరమైతే వాణిజ్యపరమైన కొనుగోళ్లు చేయడానికి సైతం ఆసక్తి చూపుతోంది. ఇదే జరిగితే వ్యాపారులకు, సీసీఐ మధ్య కొనుగోళ్ల మధ్య పోటీ ఏర్పడి రైతుకు మేలు జరగనుంది.
సీసీఐ పోటీలో ఉంటే రైతులకు జరిగే లాభం:
- భారత పత్తి సంస్థ(సీసీఐ) పోటీలో ఉంటే మద్ధతు ధరలో న్యాయం జరిగే అవకాశం ఉంది.
- మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నాణ్యత ప్రమాణాలకు అనగుణంగా ధర లభిస్తుంది.
- వారం రోజుల వ్యవధిలో బ్యాంకు ద్వారా డబ్బులు చేతికి అందుతాయి.
- ప్రైవేటు వ్యాపారుల సిండికేట్ వ్యవహారాన్ని కట్టడి చేసినట్లు ఉంటుంది.
- జిన్నింగుల్లో పగలు, రాత్రి నిరీక్షించకుండా వెంటనే వాహనాల పాసింగ్
త్వరలోనే ప్రారంభం..
'పత్తి కొనుగోళ్లకు త్వరలోనే ముహూర్తం ఖరారుచేస్తాం. ఇప్పటికే ఓసారి పాలనాధికారితో సమావేశం జరిగింది. శాసనసనభ సమావేశాలు ముగియగానే ప్రజాప్రతినిధులు, రైతులతో మరో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ నెల చివరి వారంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నాం.'
-శ్రీనివాస్, మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు
ఇదీ చదవండి: లేత మనసుల్లో కల్లోలం.. ప్రతి 11 నిమిషాలకు ఒకరి ఆత్మహత్య!