ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరవాత తెలంగాణలో ఒక్క హైదరాబాద్‌లోనే విమానాశ్రయం ఉంది. ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడిపేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లా మామ్నూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లా గుడిబండలలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
పర్యటించిన ఏఏఐ బృందం
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సిందిగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను 2018లో కోరింది. 2019 జులై, ఆగస్టు నెలల్లో రెండు దశల్లో ఆరు ప్రాంతాల్లోనూ అధికారుల బృందం పర్యటించి అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల దిల్లీ పర్యటనలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరికి ప్రాంతీయ విమానాశ్రయాల ప్రతిపాదనలను వేగవంతం చేయాల్సిందిగా వినతి పత్రం ఇవ్వటంతో ఆ ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. అధికారుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
ఏఏఐ గుర్తించిన అంశాలు
ఆరు ప్రాంతాలకుగాను మూడు ప్రాంతాల్లో కొండలు ఉన్నాయని ఏఏఐ బృందం గుర్తించింది. పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రతిపాదించిన ప్రాంతాల్లో ఒక వైపు ఎత్తెన కొండలు ఉన్నాయని ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. అవి పెద్ద ప్రతిబంధకాలు కాకపోయినప్పటికీ... రాకపోకల్లో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి విమానాశ్రయంలో వేరువేరు దిశలలో... విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మూడు ప్రాంతాల్లో కొండలు ఉన్న దృష్ట్యా... ఆ సమస్యను అధిగమించేందుకు ఒకే దిశలో రాకపోకలను అనుమతించే అంశాన్ని పరిశీలించవచ్చని సూచించింది. ఈ అంశంపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక బృందం అధ్యయనం చేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఏఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు.
పెట్టుబడి రాబట్టుకోవటం సాధ్యమేనా?
ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవటంలో సాధ్యాసాధ్యాలపై ఏఏఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కాస్తంత ముందూ వెనుకగా పెట్టుబడి రాబట్టుకోవటం పెద్ద సమస్య కాదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఆ పరిసర ప్రాంతాలు భారీగా అభివృద్ధి చెందుతాయని వాటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా ఏఏఐ అధికారుల బృందం మరో దఫా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇదీ చదవండి : నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్