ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్సలు, సహాయక చర్యలపై ఎమ్మెల్యే జోగురామన్న అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అదనపు పాలనాధికారి డేవిడ్, రిమ్స్ డైరెక్టర్ బలరాం బానోత్, ఇతర జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత అంశంపై చర్చిస్తుండగా.. రిమ్స్ డైరెక్టర్ ఒక్కసారిగా తన అసహనాన్ని వెల్లగక్కారు. తాను ఎమ్మెల్యే మాట వినడం లేదని తనపై కక్షకట్టారంటూ ఆరోపించారు. తనను ప్రభుత్వం నియమించిందని.. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను పని చేస్తానన్నారు. తన తీరు నచ్చకపోతే బదిలీ చేయించుకోండంటూ ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.
రిమ్స్ డైరెక్టర్ విమర్శిస్తున్నా.. సావధానంగా విన్న రామన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు సరైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో సమావేశం పెట్టామే తప్పా.. ఎవరినీ నిలదీయడానికో.. తిట్టడానికో కాదని చెప్పుకొచ్చారు. తాను చెబితే వినే మనిషినే తప్పా.. ఎమ్మెల్యేనని బెదిరించే మనిషి కాదంటూ తనదైన రీతిలో స్పందించారు. అందరూ సమన్వయంతో పనిచేసి కొవిడ్ నియంత్రణకు పాటుపడాలని హితవుపలికారు.
ఇదీ చూడండి: గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించి జీతాలు పెంచాలి: ఆర్.కృష్ణయ్య