ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన 62 మంది గిరిజన దళిత రైతులు ఆవేదన చెందుతున్నారు. 1992లో తమకు భూమిని కేటాయించి అప్పటి తహసీల్దార్.. పట్టాలను అందజేశారని అన్నారు. భూమిలో సామాజిక అడవులు పెంచుకొని బతకాలని, ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకొని జీవించాలని వారికి పొసెషన్ పట్టాలో పేర్కొన్నారని వివరించారు.
కానీ ఆ భూమిని మాత్రం ఇంతవరకు కేటాయించలేదని రైతులు చెబుతున్నారు. గత 27 ఏళ్లుగా ఇటు తహసీల్దార్ కార్యాలయం, అటు జిల్లా పాలనాధికారి కార్యాలయానికి అనేక సార్లు తిరిగినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 28, 29లో తమకు భూమి కేటాయిస్తున్నట్లు పట్టాలు ఇచ్చారని, కానీ ఆ భూములను చూపించడం లేదని అంటున్నారు. తక్షణమే తమ భూములను చూపించి ప్రభుత్వం సర్వే జరిపించి తమకు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పట్టాలు ఉన్నాయి కానీ, బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి : ఉత్తమ సిటిజెన్స్ అవుదాం..