టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్‌కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్ ఎస్ఎస్4లో సుహాస్ లాలినకెరె యతిరాజ్(Suhas Yathiraj Paralympics) రజతం సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో 1-2 తేడాతో ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో ఓటమి పాలై.. రజతంతో సరిపెట్టుకున్నారు.
నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్(38).. భారత్ తరఫున పారాలింపిక్స్‌లో పాల్గొన్న సివిల్ సర్వెంట్‌గా నిలిచారు. తొలి పతకం పట్టిన ఐఏఎస్ కూడా ఆయనే.
ఎస్ఎల్ 4 కాంస్య పతక పోటీలో తరుణ్ ధిల్లాన్(Tarun Dhillon Paralympics) ఓటమి పాలయ్యాడు. ఇండోనేసియా ఆటగాడు ఫ్రెడీ సతియావన్ చేతిలో ఓడిపోయాడు.
యతిరాజ్పై ప్రశంసలు..
రజతం గెలిచిన ఐఏఎస్ అధికారి యతిరాజ్‌ను రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రశంసించారు.
"ప్రపంచ నంబర్.1 ఆటగాడికి గట్టి పోటీ ఇచ్చి రజత పతకం సాధించిన యతిరాజ్‌కు అభినందనలు. కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టడం గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో మరింతగా రాణించాలి."
--రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి.
"స్పోర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన యతిరాజ్‌కు శుభాకాంక్షలు. సర్వీస్‌లో ఉంటూ పారాలింపిక్స్‌లో రజతం సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు యతిరాజ్. భవిష్యత్తులో యతిరాజ్ మరింతగా రాణించాలని ఆశిస్తున్నా."
-- నరేంద్ర మోదీ, ప్రధాని.
పారాలింపిక్స్ పతక విజేతకు అభినందనలు తెలిపారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. గతంలో కూడా యతిరాజ్ ఎన్నో పతకాలు గెలిచారని అన్నారు. అధికారిగా విధులు నిర్వహిస్తూనే పారాలింపిక్స్‌లో పతకం నెగ్గడం హర్షనీయమని అన్నారు.
ఆరేళ్ల శ్రమ..
యతిరాజ్ ఫైనల్లో బాగా ఆడాడని ఆయన సతీమణి రితూ సుహాస్(Suhas Lalinakere Yathiraj Wife) చెప్పారు. పతకం గెలవడం ఆయన ఆరేళ్ల శ్రమకు ప్రతిఫలమని అన్నారు. ప్రస్తుతం ఆమె గాజియాబాద్ ఏడీఎంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ పతకంతో.. టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 18కు చేరింది.