ఒలింపిక్స్ పురుషుల బాక్సింగ్ సూపర్ హెవీ వెయిట్(91 కేజీలు ప్లస్) విభాగంలో.. భారత బాక్సర్ సతీశ్ కుమార్ నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్, ప్రపంచ ఛాంపియన్ బఖోదిర్ జలోలొవ్ చేతిలో 5-0తో చిత్తుగా ఓడి.. ఇంటిదారి పట్టాడు.
13 కుట్లు పడినా..
ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో గెలిచిన సతీశ్ కుమార్‌కు.. గాయాలయ్యాయి. నుదుటన, మొహంపై మొత్తం 13 కుట్లు పడ్డాయి. అయినా.. ప్రపంచ నెం.1ను ఎదుర్కొనేందుకు అవేమీ లెక్కచేయలేదు. రింగ్‌లో పోటీ ఇచ్చినా.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ అనుభవం ముందు తేలిపోయాడు సతీశ్.
ప్రస్తుతం అతడు కాస్త నిరాశకు గురయ్యాడని, ఓటమి నుంచి తేరుకున్నాక అతడెంత గొప్ప పోరాటం చేశాడో అర్థం చేసుకుంటాడని ఇండియన్ బాక్సింగ్ హైపెర్ఫామెన్స్ డైరెక్టర్ సాంటియాగో నీవా అన్నారు. అంతటి గాయాలతో ఆడటం తేలికైన విషయం కాదని, అది గర్వపడాల్సిన విషయమని ఆయన పేర్కొన్నారు. జలోలొవ్ కొట్టిన ప్రతి పంచ్ సతీశ్‌కు తీవ్రమైన నొప్పిని కలిగించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అతడి ధైర్యం, దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు.
ఒక్క పతకమే..
సతీశ్ ఓటమితో.. బాక్సింగ్ పురుషుల విభాగంలో భారత ప్రస్థానం ముగిసింది. పతకం ఖాయమనుకున్న భారత ఫేవరేట్ బాక్సర్ అమిత్ పంగాల్(52 కేజీలు) ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం గమనార్హం.
భారత్‌కు ఈసారి బాక్సింగ్‌లో వచ్చేది కూడా ఒక్క పతకమే. మహిళల వెల్టర్ వెయిట్(69 కేజీలు) విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసింది.
ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో.. టర్కీ బాక్సర్ సుర్మేనేలి బుసానాజ్తో తలపడనుంది లవ్లీనా.
ఇదీ చూడండి: బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా- భారత్‌కు మరో మెడల్ ఖాయం