పచ్చికపై రాకెట్ల సమరానికి వేళైంది. నేటి నుంచే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్(Wimbledon) టోర్నీ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ కారణంగా గతేడాది రద్దయిన ఈ టోర్నీపై ఇప్పుడు అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్(Djokovic) పురుషుల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్‌లో ఆష్లే బార్టీ టాప్ సీడ్‌గా పోరుకు సిద్ధమైంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ సరసన నిలవాలనుకుంటున్న సెరెనా(Serena Williams).. ఈసారైనా ఆ ప్రయత్నంలో విజయవవంతమవుతుందా అన్నది ఆసక్తికరం.
ఫెదరర్ తక్కువేం కాదు!
జకోవిచ్ జోరు మీదున్నా, ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. ఎనిమిది సార్లు ఛాంపియన్, ఏడో సీడ్ ఫెదరర్(Federer)ను తేలిగ్గా తీసుకోలేం. కానీ 40వ ఏట టైటిల్ నెగ్గాలటే అతడు తీవ్రంగా శ్రమించాల్సిందే. మోకాలి గాయం నుంచి కోలుకున్న అతడు ఒకప్పటంత ఫిట్‌గా కూడా లేడు. ఫెదరర్ చివరిసారి 2018లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడు వింబుల్డన్‌లో మన్నారినోతో పోరుతో అతడు టైటిల్ వేటను ఆరంభిస్తాడు.
ఇక రొలాండ్ గారోస్‌లో టైటిల్ కోసం జకోవిచ్‌తో హోరాహోరీగా తలపడ్డ గ్రీకు వీరుడు సిట్సిపాస్ కూడా గట్టి పోటీదారుడే. మూడో సీడ్‌గా టోర్నీలో అడుగుపెట్టనున్నాడు. రెండో సీడ్ మెద్వెదెవ్, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్, ఐదో సీడ్ అలెగ్జాండ్ జ్వెరెవ్ కూడా టైటిల్‌ను ఆశిస్తున్నారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓడిన రఫెల్ నాదల్ వింబుల్డన్ నుంచి వైదొలిగాడు.
సెరెనా ఈసారైనా..!
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ బార్టీ, ఏడు సార్లు విజేత సెరెనా విలియమ్స్ సహా అనేక మంది టైటిల్‌పై కన్నేశారు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్‌ను సమం చేయాలని తహతహలాడుతున్న సెరెనాకు ఈసారి కూడా అంత తేలి కాబోదు. ఆమె గత రెండుసార్లూ ఫైనల్‌కు చేరినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. యువ ప్రత్యర్థులను కాదటని విజేతగా నిలవాలంటే ఆరో సీడ్ సెరెనా బాగా కష్టపడాల్సిందే. తొలి రౌండ్లో ఆమె సన్నోవిచ్‌ను ఢీకొంటుంది.
బార్టీతో పాటు రెండో సీడ్ సబలెంక, మూడో సీడ్ స్వితోలినా, ఏడో సీడ్ స్వైటెక్ టైటిల్ రేసులో ఉన్నారు. ప్రపంచ నంబర్-2 ఒసాకా ఈ టోర్నీలో ఆడట్లేదు. టోర్నీని వీక్షించేందుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.